Tuesday, October 9, 2012

పానుగంటి లక్ష్మీనరసింహారావు

ప్రసిది ్ధచెందిన ఆధునిక తెలుగు రచయితలలో పానుగంటి లక్ష్మీనరసింహారావు ఒకరు. తెలుగు సాహిత్యంలో వ్యాసాలకు సముచిత స్థానం కల్పించింది ఆయనే. పానుగంటి రాసిన సాక్షి వ్యాసాలు ఆయనకు మంచిపేరు తెచ్చి పెట్టాయి. ఆయన 1865 నవంబర్ 2న తూర్పుగోదావరి జిల్లా, రాజమండ్రి సమీపంలోని సీతానగరంలో జన్మించారు. తల్లిదండ్రులు రత్నమాంబ, వెంకటరమణయ్య. పానుగంటి తండ్రి రాజమండ్రిలో ఆయుర్వేద వైద్యుడు. పానుగంటి లక్ష్మీనరసింహారావు విద్యాభ్యాసం ఎక్కువ శాతం రాజమండ్రిలోనే జరిగింది. ఆయన 1884లో మెట్రిక్యులేషన్, 1888లో బి.ఎ.లో ఉత్తీర్ణులయ్యారు.

చదువు పూర్తయిన తర్వాత పెద్దాపురంలోని ఉన్నత పాఠశాలలో కొంతకాలం ఉద్యోగం చేశారు. ఆ తర్వాత నరసాపురం జమీందారు దివానుగా పనిచేశారు. కొన్ని సంవత్సరాల తర్వాత వేరే సంస్థానాలలో కూడా దివానుగా కొంతకాలం ఉన్నారు. ఆ తర్వాత పిఠాపురం రాజు దగ్గర ఆస్థానకవిగా చేరారు. పిఠాపురం రాజు సూర్యారావు కోరిక మేరకు పానుగంటి అనేక నాటకాలు రాశారు.

మహారాజు స్వయంగా వాటిని అచ్చు వేయించేవారు. అలా తెలుగు సాహిత్యంలో ఒక స్థానాన్ని పానుగంటి సంపాదించుకున్నారు. 

పానుగంటి రచనలు ఆయనకు ‘ఆంధ్రా షేక్‌స్పియర్’, ‘ఆంధ్రా ఎడిసన్’ అనే పేర్లు తెచ్చిపెట్టాయి (విలియం షేక్‌స్పియర్ ఆంగ్ల సాహిత్యంలో ప్రఖ్యాతిగాంచిన నాటక రచయిత, ఎడిసన్ పేరుప్రఖ్యాతులున్న వ్యాసకర్త). లక్ష్మీనరసింహారావుకు ‘అభినవ కాళిదాసు’ అనే బిరుదు కూడా ఉంది. ఆ కాలంలో ‘సింహత్రయం’’ గా పేరుగాంచిన ముగ్గురిలో పానుగంటి లక్ష్మీనరసింహా రావు ఒకరు. మిగిలిన ఇద్దరు-చిలకమర్తి లక్ష్మీనరసింహం, కూచి నరసింహం. పానుగంటి ‘విప్రనారాయణ చరిత్ర’, ‘పాదుకా పట్టాభిషేకం’, ‘రాధాకృష’్ణ, ‘కాంతాభిరామం’, ‘రాతిస్తంభం’, ‘కళ్యాణ రాఘవం’ వంటి రచనలను తెలుగువారికి అందించారు. ఆస్థాన కవిగా విలాసవంతమైన జీవితం గడిపిన పానుగంటి జీవిత చరమాంకంలో పేదరికంతో బాధలు పడుతూ 1940 అక్టోబర్ 4న మరణించారు.

BACK TO  CONCEPT

1 comment:

CONCEPT భావన said...

మన రాష్ట్రంలో తెలుగు భాష క్రీ.శ 5వ శతాబ్దంలో ప్రాచుర్యంలోకి వచ్చింది. అయితే అంతవరకు ఏ భాష మాట్లాడే వారు? అంటే... ప్రాకృత, సంస్కృత భాషలు వాడుకలో ఉండేవి. పండితులు సంస్కృతంలో మాట్లాడేవారు, పామరులు ప్రాకృతం మాట్లాడేవారు. గ్రంథాలు, అధికారిక వ్యవహారాలన్నీ సంస్కృతంలోనే రాసేవారు. విష్ణుకుండినుల కాలంలో తెలుగు అధికార భాష అయింది. వీరు వినుకొండ రాజధానిగా పాలించారు.

విష్ణుకుండినుల కాలం నుంచి తెలుగు అధికార భాష అయినప్పటికీ గ్రంథాలు వెలువడింది వేంగీ చాళుక్యుల కాలంలోనే. రాజరాజనరేంద్రుని ఆస్థానకవి నన్నయ భట్టారకుడు రాసిన మహాభారతం తొలితెలుగు రచన. తెలుగు శాసనం రేనాటి చోళులు వేయించగా గ్రంథరచనకు వేంగీ చాళుక్యులు పూనుకున్నారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ తెలుగులో నాణేలను ముద్రించింది.